అత్తా ఒక ఇంటి కోడలే

Girls her wants freedom after marriage

ఈ తరం ఆడపిల్లలు కొత్తగా పెళ్లవగానే తమకంటూ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గర ఉన్నప్పుడు వారు చూపించే ప్రేమలు, ఆప్యాయతలతో వారికి స్వేచ్ఛ ఉంటుంది. వారు ఏది అడిగినా ఆ పిల్లకి కొనిస్తారు లేదా కొనివ్వటానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడుండే పిల్లకాదు గదా పెళ్లిచేసుకుని ఎలాగూ వెళ్లిపోతుంది దాని ముచ్చట ఎందుకు కాదనాలి అని అనుకుంటారు. చదువుకు కూడా వెనుకాడకుండా ఫీజు ఎంతైనా చదివిస్తున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. ఉద్యోగం చేస్తానంటే చేయిస్తున్నారు. ఆ అమ్మాయి సంపాదన ఎలా ఖర్చు పెట్టుకున్నా అడగటం లేదు. ఇలాంటి అలవాట్లతో ఈ రోజు ఆడపిల్లలకు కొంచెం పెంకితనాలు, నా మాటే నెగ్గాలి అనే భావాలు వస్తున్నాయి. పెళ్లయినా ఇలాగే ఉంటుంది అని అనుకునవారు లేకపోలేదు. దీంతో వీరు మెట్టినింట అడుగుపెట్టడానే అక్కడ ఆడపడుచు, బావగారు, అత్త, మామ వీళ్లందరితో కలవలేకపోతోంది. ఇంట్లో పనులు చేయాలన్నా అలవాటు లేక తప్పించుకోవటం.. ఇక అక్కడినుండి గొడవలు మొదలు అవుతున్నాయి. డబ్బులు లెక్కగా ఖర్చుపెట్టటం ఇదివరకటి స్వేచ్ఛ లేక సర్దుబాటు ధోరణి వారిలో రావడం కష్టమవుతోంది. అది ఒక్కొక్కసారి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

పిల్లలని కనాలన్నా వారి అందం తగ్గిపోతుందనే భయం వారిలో వస్తోంది. ఇళ్లలో వచ్చే టివి సీరియల్స్ చూసి వాటిలోని హింసాత్మక చర్యలను అనుసరించేవారు కొంతమంది ఉంటున్నారు. కోడలిని కూతురిలా అత్త చూసుకోవాలి. కోడలు అత్తని తల్లిగా భావించి ఆవిడ చెప్పినవి అర్థం చేసుకుని ఆ ఇంటి బాధ్యతలను పట్టించుకోవాలి. ఏదో ఒక మాట మీద కోపం వచ్చినా అది తన మంచికే అనేది గ్రహించాలి. ఉద్యోగంలో స్నేహితులు ఏదైనా చెపితే దాన్ని పట్టించుకోకూడదు. ఇంటి పరిస్థితులు వేరు, ఆఫీసు పరిస్థితులు వేరు. స్నేహితులు కొంతమంది కుటుంబ వ్యవస్థను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారి సలహాలను పెడచెవిన పెట్టాలి. ఇరువురు సంయమనంగా మెలిగితే అత్త కూడా అమ్మలానే ప్రేమిస్తుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఏ సమస్యలూ రావు. జీవితం ఏ ఒడుదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న చిన్నారులు తాతయ్య, బామ్మలతో హాయిగా జీవిస్తారు.

అత్తగారి చేతిలో కుండ పగిలితే అది పాత కుండ అని, అదే కుండ కోడలు చేతిలో పగిలితే కొత్తకుండ అని వెక్కిరించేవారు. సృష్టిలో తేడా ఉండదు. అలాగే దృష్టిలో కూడా ఉండకూడదు. సినిమాల్లో, టివి సీరియల్స్‌లో చూపించినట్టుగా అత్తాకోడళ్లు నిప్పు ఉప్పులాగే ఉండాలని లేదు. స్నేహంగా , సామరస్యంగా కలిసిమెలిసి ఉండేవారు, ఒకరిని ఒకరు గౌరవించుకునేవారూ ఉంటారు. ఆత్మగౌరవం అనే మాటకు అర్థం తెలిసిన ఏ మహిళా మరొక మహిళను కించపరచదు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎంతగా అర్థం చేసుకున్నా అత్తతో కోడలు చెప్పుకునే విషయాలు, అత్తగారింట్లో మాట్లాడుకునే విషయాలు కొన్ని ఉంటాయి.

అచ్చంగా పాత సినిమాల్లో సూర్యకాంతం లా ప్రవర్తించే అత్త గారయితే రోజూ ఇంట్లో రణరంగమే అవుతుంది. కాబట్టి కొత్తకోడలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. మీ అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు..అని మాత్రం అత్తతో ఏ కోడలు అనవద్దు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ తల్లి అయినా తన కొడుకు గురించి తనకే బాగా తెలుసు అని అనుకుంటుంది. భార్య, కోడలుకి కొడుకు మనసులో ఒకే స్థానం ఉంటుందని తెలిసినా, కొడుకుకి మానసికంగా తానే దగ్గర అనే భావంలో ఉంటుంది అత్తమ్మ. తన సొంత ఆస్తిని కోడలుకు అప్పజెప్పితే కోడలు ఆమెని తల్లిలా భావిస్తుంది. అది కొడుకుమీద ఉన్న ప్రేమే అనుకున్నా, అందులో ఒక అభద్రతా భావం కూడా ఉంటుంది. అందుకే అత్తగారితో ఈ మాట ఎప్పుడు అనకూడదు.

నాకు అన్ని తెలుసు మీ సలహాలు అవసరం లేదు అనకండి. ఏ విషయం గురించైనా ఆమె చెప్పేది వినండి. కొడుకు జీవితంలో కొత్త కోడలుతో అతనికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అనే భయంతోనూ చాలామంది అత్తలు కోడళ్లకు చాలా సలహాలు ఇస్తుంటారు. ఏ తల్లికైనా పిల్లల జీవితాలు ఒక కొనసాగింపు. ఆ కొనసాగింపుని అర్ధంతరంగా కట్ చేసుకుని ఇక నాకేం సంబంధం లేదు అని ఏ తల్లి అనుకోలేదు. అందుకే ఆమె సలహాలు చెబుతుంది. వినండి బాగుంటే ఆచరించండి. మంచిగా లేక పోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

‘మా అమ్మ చాలా బాగా వండుతుంది’ అని ఇలా ఎప్పుడూ కొడుకు తన భార్య ముందు అనకూడదు. ఆమెను తల్లితో పోల్చి చూస్తే, స్పోర్టివ్‌గా తీసుకోలేరు. అందులో నిజమున్నా ఒప్పుకోలేరు. మీ తల్లి చేసే వంట మీకు ఎంతగా నచ్చినా, అది మీ సొంత విషయంగా మనసులో ఉంచుకుంటే, మీకు మీరు మేలు చేసుకున్నవారు అవుతారు. మీరు తెచ్చిన ఈ చీర, రవికె మంచిగా లేదనే మాటలు ఎప్పుడూ అనకండి అత్త అభిరుచికి, షాపింగుకి వంకలు పెట్టకండి. ఆమె సెలక్షన్ నచ్చకపోయినా ఇదేం సెలక్షన్ అస్సలు బాలేదు అనకండి. అత్త ఇచ్చిన గిఫ్ట్‌ని ఆనందంగా స్వీకరించడం కూడా మంచి కోడలు లక్షణమే. ఇలాంటి మేల్కొలుపులను అర్థం చేసుకుంటే ఏ గొడవలూ ఉండవు. భర్త సంపాదన తక్కువయినా అర్థం చేసుకుని పొదుపుగా ఉండాలి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని ఇంటిని నడిపించే బాధ్యత కోడలి చేతిలోనే ఉంటుంది.