అటల్‌జీ అస్థికలతో బిజెపి నేత సెల్ఫీ…!

Vijay Autade takes selfies with Atal Bihari Vajpayee's ashes

ముంబయి: దివంగత భారత మాజీ ప్రధాని, భారత రత్న గ్రహీత అటల్‌ బిహారి వాజ్‌పేయి అస్థికల యాత్రలో బిజెపి నేత, ఔరంగాబాద్‌ డిప్యూటీ మేయర్‌ విజయ్‌ ఔతడే సెల్ఫీ తీసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. అటల్‌జీ అస్థికలతో ఆయన సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు విజయ్‌ చర్యపై మండిపడుతున్నారు. వాజ్‌పేయి అస్థికల యాత్ర దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి ఔరంగబాద్‌లోని ఉస్మాన్‌పురాకు చేరుకుని జల్నాకు వెళ్తున్న సమయంలో ఆయన సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కన్పించాయి. ఇదిలాఉండగా చత్తీస్‌గఢ్‌లో జరిగిన అటల్‌జీ సంస్మరణ సభలో ఇద్దరు మంత్రులు నవ్వుతూ కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సంతాప సభలో మంత్రులు బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, అజయ్‌ చంద్రార్కర్‌లు ఈ వివాదానికి కారణమయ్యారు. దీంతో ఈ ఇద్దరు మంత్రుల తీరుపై కూడా సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ మహానేతకు నివాళి సమయంలో బిజెపి నాయకులు ఇలా వింత చర్యలకు పాల్పడటం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

Comments

comments